Thalapathy Vijay | తమిళ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత, నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay)పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా(Fatwa) జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతని నేపథ్యం.. అతడి గత చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫత్వాలో పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు మద్యం తాగే వారిని, జూదగాళ్లను ఆహ్వానించడం నేరమే కాకుండా పాపమని పేర్కొన్న బోర్డు.. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అటువంటి వారిని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది.
మౌలానా రజ్వీ మాట్లాడుతూ.. సినిమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముస్లిం సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు. విజయ్ గత చరిత్ర చూస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి అన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ది బీస్ట్’ చిత్రంలో ముస్లింలను, ముస్లిం సమాజాన్ని మొత్తంగా ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ సినిమాలో ముస్లింలను రాక్షసులుగా, దయ్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్ల కోసం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మద్యం ప్రియులు, అల్లరి మూకలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం ద్వారా విజయ్ రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చారని రజ్వీ పేర్కొన్నారు. ఆహ్వానించబడిన వారు ఉపవాసం పాటించలేదని, ఇస్లాం యొక్క ఆచారాలను అనుసరించలేదని ఆయన తెలిపారు. కాబట్టి, తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలాగే వారి మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ విజ్ఞప్తి చేశారు.