Mana Shankara Vara prasad Garu | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్ల గ్రాస్‌ను సాధించి మెగా సత్తాను చాటింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ లభించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ.. భారీగా పెరిగిన టికెట్ ధరలు వలన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమవుతున్నట్లు తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం అనుమతించిన ప్రత్యేక ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి కొంత వెనకాడుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో జనవరి 19 వరకు, ఏపీలో జనవరి 22 వరకు సాధారణ ధరల కంటే అదనంగా రూ. 50 నుంచి రూ. 125 వరకు వసూలు చేస్తుండటంతో, కుటుంబంతో కలిసి వెళ్లేవారిపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో ధరలు తగ్గాకే సినిమా చూద్దామనే యోచనలో చాలా మంది ఉండటం చిత్ర వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ సంక్రాంతి బరిలో పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ సరికొత్త సన్నివేశాలతో అలరిస్తుండగా, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే జనవరి 14న మరో రెండు చిన్న సినిమాలు కూడా విడుదల కాబోతుండటంతో, ఆ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే టికెట్ ధరలు తక్కువగా ఉన్న ఆ సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. పండగ సందడి ముగిసేలోపే ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే టికెట్ ధరల విషయంలో నిర్మాతలు కొంత వెనక్కి తగ్గి రేట్లు తగ్గించడమే ఉత్తమమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తే ఆక్యుపెన్సీ పెరిగి సినిమాకు మరింత లాభం చేకూరుతుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.