Sharukh Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఈరోజు తన 60వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న రాత్రి నుంచే ముంబైలోని షారుక్ నివాసం ‘మన్నత్’ వద్ద వేలాది అభిమానులు గుమికూడి తమ అభిమాన నటుడి పుట్టినరోజును సంబరంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే షారుక్ అర్థరాత్రి తన ఇంటి బాల్కనీలోకి వచ్చి అభిమానులను అభివాదం చేస్తారనే ఆశతో జనాలు రాత్రంతా అక్కడే వేచి చూశారు. అభిమానులు కేక్‌లు కట్ చేసి, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ మన్నత్ ఎదుట పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
అయితే, ఈసారి ముంబై పోలీస్ విధించిన నియంత్రణల కారణంగా షారుక్ మిడ్నైట్ అపియరెన్స్ ఇవ్వలేకపోయారు, దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ఇక షారుక్ తన కుటుంబంతో కలిసి అలీబాగ్‌లోని తన ఫార్మ్‌హౌస్‌లో సాదాసీదా వేడుక చేసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ఇక అభిమానుల ఉత్కంఠను పెంచుతూ, షారుక్ నటిస్తున్న అత్యంత ఆసక్తికర యాక్షన్ డ్రామా “కింగ్” మొదటి లుక్‌ను ఈరోజే విడుదల చేయనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
షారుక్ ఖాన్ 60 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో, అదే గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూ, బాలీవుడ్లో తన సత్తాను చాటుకుంటున్నారు. కాగా,షారూఖ్..1992లో విడుదలైన ‘దీవానా’ సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ‘బాజీగర్’, ‘దుర్’, ‘డిడిఎల్జె’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘డాన్’, ‘డాన్ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పఠాన్’, జవాన్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు షారుఖ్ కు క్రేజ్ తెచ్చిపెట్టాయి. షారుఖ్ ఖాన్ ఆస్తులు 6300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన హీరోలలో షారుఖ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 280 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.