ఫిట్నెస్పై అత్యంత శ్రద్ధాసక్తులు కనబరిచే కథానాయికల్లో సమంత ముందువరుసలో నిలుస్తుంది. యోగా, శారీరక వ్యాయామాల తాలూకు వీడియోలను తరచుగా సోషల్మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ఫిట్నెస్ను తన జీవితంలో ఓ భాగం చేసుకున్నానని, చక్కటి శరీరాకృతితో అలరారడం ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేస్తుందని సమంత అనేక సందర్భాల్లో చెప్పింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో వ్యాయామం తాలూకు ఓ ఫొటోను షేర్ చేసింది. తాను టైటిల్రోల్ని పోషిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నానని పేర్కొంది. “శాకుంతలం’ చిత్రీకరణ మరో వారంలో ముగియనుంది. ఈ సినిమా కోసం ఎప్పుడూ లేని విధంగా కఠినమైన నియమాల్ని పాటించా. సినిమా చూస్తే నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందనే భావన కలిగింది’ అని సమంత చెప్పింది. మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుని ప్రణయగాథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.