న్యూఢిల్లీ : 2025లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైబర్ మోసంలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాల ద్వారా రూ.30వేల కోట్లు దోచేసిన కేసులో ఈడీ అధికారులు ముంబైకి చెందిన ఫహిమ్ మొయిన్ హుస్సేన్ సయ్యద్, నైమ్ మొయిన్ సయ్యద్ ను అరెస్ట్ చేశారు. వారిని సోమవారం గోవాలోని పనాజీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు. 2025లో ఈ కేసు దర్యాప్తు ప్రారంభం అయింది. గోవాకు చెందిన ఓ మహిళను 2025 మే 21 నుంచి 2025 జూన్ 2 మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.2.60 కోట్లు కొట్టేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ డబ్బును నిందితులు 400 డమ్మీ ఖాతాల ద్వారా హవాలా, నగదు రూపంలో విత్ డ్రా చేసి.. ఆర్బీఐ అనుమతి ఉన్న మనీ ఛేంజర్స్ ద్వారా విదేశీ కరెన్సీగా మార్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ బ్యాంకు లావాదేవీలను అనుసరించగా కమోడిటీ, ట్రేడింగ్, ట్రావెల్, ఫారెక్స్ రంగాలకు చెందిన పరస్పరం అనుసంధానమైన సంస్థల నెట్వర్క్ బయటపడిందని ఈడీ తెలిపింది. ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వందలాది సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.27వేల కోట్ల బ్యాంకు లావాదేవీలు, రూ.3వేల కోట్ల నగదు డీలింగ్స్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ సంస్థలకు చెందిన ఖాతాలు 20 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన 300 సైబర్ నేరాల కేసులు, 163 ఎఫ్ఐఆర్లతో సంబంధాలున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.