Pushpa 2 | ‘పుష్ప’ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. మంగళవారం ఫహాద్ ఫాజిల్ ఫుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప-2’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు’ అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను జత చేశారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రెండో భాగంలో కూడా అల్లు అర్జున్-ఫహద్ ఫాజిల్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయని చిత్ర బృందం పేర్కొంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.