Sunil Special Interview | కొత్తదారుల్లో పయనం కొత్త అందాల్ని పరిచయం చేస్తుంది. సునీల్ ఇదే సూత్రాన్ని నమ్మారు. హాస్యనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన.. ‘ఎఫ్-3’లో సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సునీల్ పాత్రికేయులతో అనేక విషయాలు ముచ్చటించారు..
కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. నటుడిగా మీ పరిణామ క్రమాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తున్నది?
ప్రేక్షకుల ఆశీస్సులు, ప్రోత్సాహం ఉన్నాయి కాబట్టే విభిన్న పాత్రల్లో మెప్పించగలుగుతున్నా. ‘కృష్ణాష్టమి’లో సిక్స్‌ప్యాక్ చేసినా..‘పుష్ప’లో వయసుకు మించిన విలనీ ప్రదర్శించినా ప్రేక్షకులు ఆదరించడం వల్లనే సాధ్యమైంది.
‘ఎఫ్-3’లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
తెలుగు చిత్రసీమలో కామెడీ అద్భుతంగా పండించే దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఓ సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడు ‘నాకోసం మంచి క్యారెక్టర్ డిజైన్ చేయి. ఇద్దరం కలిసి పనిచేద్దాం’ అని అడిగా. ‘తప్పకుండా చేద్దామన్నయ్యా’ అని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే ‘ఎఫ్-3’లో నాకోసం అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో వింటేజ్ సునీల్‌ను చూస్తారు. ప్రేక్షకులకు నా పాత చిత్రాల్లోని వినోదం గుర్తుకొస్తుంది.
‘మల్లీశ్వరి’ తర్వాత వెంకటేశ్‌తో చేసిన సినిమా ఇదే. మీ ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ ఎలా ఉంటాయి?
వెంకటేశ్‌కు, నాకు మధ్య నవ్వించే సీన్స్ చాలా ఉంటాయి. కాంబినేషన్స్‌తో పాటు సినిమా తారాగణమంతా ఒకచోట పండించే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. ‘ఎఫ్-2’ కంటే పదింతల కామెడీతో ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల వర్షంలో ముంచెత్తుతుంది.
ఈ సినిమాపరంగా మీరు ఎదుర్కొన్న సవాళ్లు?
పెద్దగా ఏమీ లేవు. అయితే ‘ఎఫ్-3’ ‘పుష్ప’ సినిమాల షూటింగ్ ఒకేసారి జరిగింది. దాంతో పొద్దున ‘ఎఫ్-3’ షూట్లో పాల్గొని, సాయంత్రానికి ‘పుష్ప’ సెట్లోకి వెళ్లేవాడిని. రెండు పాత్రల మధ్య పూర్తి వైరుధ్యం వల్ల కాస్త అయోమయంగా అనిపించేది. ఆ చేంజోవర్ ఒక్కటే కొంచెం కష్టంగా ఉండేది.
మీ చిత్రాల్లో మీదైన శైలి మిస్సవుతున్నదా?
ఏదైనా పాత్రలో సహజసిద్ధమైన వినోదం పండాలంటే కథలో అందుకు తగిన వాతావరణం, ప్రాంతీయత ఉండాలి. గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రల్లో కనిపించినప్పుడు నాదైన యాస, చక్కటి టైమింగ్‌తో కూడిన కామెడీ బయటికి వస్తుంది. అదే నగర నేపథ్యమైతే అందుకు తగినట్లుగా పాత్ర ప్రవర్తిస్తుంది. కథానుగుణంగా నటించడమే నేచురల్ యాక్టింగ్ అని భావిస్తా.
ప్రస్తుతం కామెడీ సినిమాలు తీసే దర్శకులు కొంతమందే ఉన్నారు. ఈ ధోరణిపై మీరేమంటారు?
కామెడీ సినిమాలు తీసే దర్శకులు లేకపోవడం జనాల దురదృష్టం. దీనివల్ల ప్రజలకు నవ్వుకునే భాగ్యం లేకుండా పోతున్నది. నవ్వితే వచ్చే కిక్ అన్ని బాధల్ని దూరం చేస్తుంది. కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. కామెడీ సినిమాలకంటే థ్రిల్లర్స్, సీరియస్ మూవీలే ఎక్కువగా వస్తున్నాయి. వాటితో పాటు హాస్య చిత్రాలు కూడా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నా.
మీలో ఓ రచయిత కూడా ఉన్నారు కదా..
పెన్ను, పేపర్ పట్టుకొని తీవ్రంగా ఆలోచించేంత రచయిత నాలో లేడు (నవ్వుతూ). ఉన్న పళంగా, సహజంగా కొన్ని డైలాగ్‌లు చెబుతుంటా. ఈ మధ్య ఓ సినిమాలో ‘గుడ్ మార్నింగ్’ అంటే ‘నాకొద్దు’ అని అంటా. ఇలా ఆన్‌లొకేషన్‌లో నా పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌లో కామెడీ దట్టిస్తుంటా. మనుషుల్లో ఉండే ఇంటెలిజెన్స్‌పై నాకు పెద్దగా నమ్మకం లేదు. మనం దాటివచ్చిన అనుభవాల ఆధారంగా మన మెదడు ఎంతో సమాచారాన్ని ప్రోది చేసుకుంటుంది. అవసరమైన సందర్భాల్లో అదంతా తన్నుకొచ్చేస్తుంది. నేనూ అలాంటి రచయితనే అనుకుంటా.
అన్ని రకాల పాత్రలూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పరిపూర్ణ నటుడిగా పరివర్తన చెందినట్టేనా?
నటన అనేది మహాసముద్రం. ఎవరైనా ‘నేను పరిపూర్ణ నటుణ్ని అయ్యాను’ అంటే అది పచ్చి అబద్ధమే. ప్రస్తుతం నటనలో నేను తొలి అడుగులు వేస్తున్నానని అనుకుంటున్నా. కమల్‌హాసన్‌గారి ఓ ఐదు సినిమాలు చూస్తే చాలు, మనం చేయని ఎన్నో క్యారెక్టర్స్ కనిపిస్తాయి (నవ్వుతూ). అదృష్టం కొద్ది నాకు కామెడీ మాత్రమే కాకుండా భిన్న పాత్రల్ని పోషించే అవకాశం లభిస్తున్నది.
బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయా?
విలన్ పాత్రల కోసం కొంతమంది అడిగారు. ఒక్క బాలీవుడ్ నుంచే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి కూడా విలన్ రోల్స్ కోసం అడిగారు. బాలీవుడ్లో రెండు సినిమాలు అంగీకరించా. అయితే అవి సెట్మీదికి వెళ్లాకే వివరాలు వెల్లడిస్తాను.
మీ కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?
కెరీర్ విషయంలో ప్లాన్ చేయడం ఎప్పుడో మానేశాను. కాలం ఏం ప్రసాదిస్తే అదే స్వీకరించాలని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను గ్రౌండ్లో ఓ కుర్చీ వేసుకొని కూర్చున్నా. ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమన్నట్టు.. ఏ క్యారెక్టర్ చేయడానికైనా రెడీగా ఉన్నా. ఏ పాత్ర వరించినా దానికి పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా. స్వతహాగా నాకు కామెడీ ఇష్టం కాబట్టి అలాంటి పాత్రలే ఎక్కువగా చేయాలనుకుంటున్నా.
మీ మిత్రుడు త్రివిక్రమ్ తదుపరి సినిమాలో మీరు చేస్తున్నారా?
అవకాశం ఉంటే త్రివిక్రమ్ తప్పకుండా ఓ మంచి పాత్ర రాస్తాడు. ‘భీమ్లానాయక్’లో అవసరం లేకపోయినా ఓ పాటలో నన్ను చూపించాడు. త్రివిక్రమ్ నా లక్కీహ్యాండ్. ‘పుష్ప-2’ తర్వాత నేను ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నా. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’తో పాటు శంకర్-రామ్‌చరణ్ కాంబినేషన్లోనూ నటిస్తున్నా. వీటితోపాటు ఓ పది చిన్న చిత్రాల్లో నటిస్తున్నా. హీరోగా రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
…? సినిమా డెస్క్
Sunil | సొంతం సినిమా చాలా సార్లు చూశాడట..ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చాడు : సునీల్”
Tollywood Villain | స్ట్రాంగ్ విలన్ కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..!”
“F3 ట్రైలర్లో ఇవి గమనించారా.. అనిల్ రావిపూడి మామూలోడు కాదు..”
Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!