F2 Movie | ఒకప్పుడు ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలను రీమేక్ చేస్తే జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంతా ఓటీటీల యుగం నడుస్తుంది. సినిమా బాగుందంటే భాష గురించి ఆలోచించకుండా సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ పరభాష సినిమాలు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో రీమేక్ సినిమాలు చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా వరకు సినీ ప్రియులు ఆల్రెడీ ఆ సినిమాను ఒరిజినల్ భాషలో చూసేసే ఉంటారు. అలాంటప్పుడు రిజీనల్ లాంగ్వేజ్‌లో రీమేక్ చేస్తే పెద్దగా పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో అలా రీమేక్ చేసిన బోలెడు సినిమాలు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి.
ఇలాంటి టైమ్‌లో ఓ తెలుగు సినిమా హిందీలో రీమేక్ కాబోతుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాలుగేళ్ల కిందట వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి చేసిన ఎఫ్-2 ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవరం లేదు. వినయ విధేయ రామా వంటి మాస్ కమర్షియల్ సినిమాకు పోటీగా దిగి.. సంక్రాంతి విన్నర్‌గా ఎఫ్-2 నిలిచింది. ఈ సినిమాలో వెంకీ మామ కామెడీ టైమింగ్.. వరుణ్ తేజ్ తెలంగాణ యాస, మోహరీన్ అల్లరి అబ్బో ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటే పోతే సినిమా మొత్తం నవ్వులే నవ్వులు. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ఇలాంటి సినిమా రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. అప్పుడే ఈ సినిమా దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
కాగా ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. అంతేకాకుండా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అనీల్ రావిపూడీ రీమేక్ వెర్షన్‌ను కూడా తెరకెక్కించనున్నారట. భగవంత్ కేసరి విడుదలైన తర్వాత దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇప్పటికే జెర్సీ, హిట్ రీమేక్‌లతో చేతులు కాల్చుకున్న దిల్‌రాజు ఎఫ్-3 రీమేక్తోనైనా కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే చాన్స్ ఉంది.