విక్కీకౌశల్ ‘మహావతార్’ లుక్ విడుదలైన నాటినుంచి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా గురించి దర్శకుడు అమర్ కౌశిక్ తన తాజా ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ‘ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. నేను అరుణాచల్‌ప్రదేశ్‌లో చదువుకునే రోజుల్లో మా దగ్గర్లోనే పరశురామ్ కుండ్ ఉండేది. అసలు ఈ పరశురాముడెవరు? అని అమ్మని అడిగితే.. అతని గురించి పెద్దగా మాట్లాడకూడదని, తను బాగా కోపిష్టి అని మాత్రమే చెప్పింది.
ఆ పాత్ర గురించి ఆసక్తి పెరిగి, భాగవతం చదివి ఆ పురాణపురుషుడి గురించి తెలుసుకున్నాను. అప్పట్నుంచే ఆయన కథ సెల్యులాయిడ్ పైకెక్కించాలనే కోరిక మొదలైంది.’ అన్నారు అమర్ కౌశిక్. ఇంకా చెబుతూ ‘ఈ సినిమా కోసం ఆరేడు నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్ డిజైన్, ఆయుధాల డిజైన్, పాత్రల ఆహార్యాలు వీటన్నింటిపై పనిచేస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. గట్టిగా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ పైకెళ్తాం.’ అని తెలిపారు.