Kangana Ranaut | మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నది.
ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీరంగంపై కంగనా రనౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతిభ ఉన్న వారికి బాలీవుడ్లో గుర్తింపు లభించదని, అలాంటి వారిని అణగదొక్కడానికి కుట్రలు చేస్తారని ఆరోపించింది. ఇండస్ట్రీపై ధిక్కార స్వరం వినిపించినందుకే ఓ సమయంలో తనను బహిష్కరించారని పేర్కొంది. ‘నా దృష్టిలో బాలీవుడ్ ఎలాంటి కనికరం లేని ప్రదేశం. ఇక్కడ ఎవరైనా ఎదుగుతుంటే అసూయ పడతారు.
ప్రతిభావంతుల కెరీర్‌ను ఎలా నాశనం చేయాలని నిరంతరం ప్రణాళికలు రచిస్తుంటారు. పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వారిపై దుష్ప్రచారం చేయిస్తారు. చివరకు ఇండస్ట్రీ నుంచి వారిని వెలివేసేలా పరిస్థితులను సృష్టిస్తారు’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.