హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలు. దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ పాట ‘ఈశ్వరుడే..’ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పాటను చిరంతన్ భట్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యాన్ని అందించగా కాలభైరవ పాడారు.
ఈశ్వరుడే, ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే..సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్యే బింబిసారుడే…అంటూ సాగుతుందీ పాట. ఈ పాట విడుదల సందర్భంగా గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ…‘ఇలాంటి గొప్ప కథను సినిమాగా తెరకెక్కించిన కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ఠ్‌కు అభినందనలు. గత యుగాల్లో మనిషి చేసిన పాపం మరో జన్మెత్తి అనుభవించేవాడు. కలియుగంలో ఎప్పుడు చేసిన పాపం అప్పుడే అనుభవించాలి. కథలో ఇలాంటి సందర్భాన్ని వ్యక్తీకరిస్తుందీ పాట. సందర్భం వినగానే పాటను రాసే స్ఫూర్తి కలిగింది’ అన్నారు. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ..‘కర్మ ఫలితాన్ని చెప్పే పాట ఇది. నేను ఈ సందర్భంలో పాట స్వరపర్చడం ఇదే తొలిసారి. ఈ కథలో మంచి పాటలు కూర్చే ఆస్కారం ఉంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, కాలభైరవ గాత్రం మరింత వన్నె తెచ్చింది’ అన్నారు. ‘ఓ మంచి పాటను సినిమాకు అందించిన మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్స్’ అన్నారు దర్శకుడు వశిష్ఠ్.