Dulquer Salmaan | మలయాళ స్టార్ నటులైన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇళ్లల్లో ఇప్పటికే కస్టమ్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే కేరళలోని పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు జరిగాయి. కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ వాహనాలు లభించలేదని కస్టమ్స్ అధికారులు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చలకల్కల్ నివాసాలలో ఈడీ సోదాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. భూటాల్ ఆర్మీ తన వావన శ్రేణీలోని కొన్ని ఖరీదైన వాహనాలని ఉపసంహరించుకోగా, కొందరు ఏజెంట్స్ వాటిని వేలంలో దక్కించుకొని వాటిని కస్టమ్స్ డ్యూటీ ఏమి చెల్లించకుండా ఇండియాకి స్మగ్లింగ్ చేసినట్టు టాక్ నడుస్తుంది.
సినీ, వ్యాపారవర్గాలలోని కొందరికి మాత్రమే లగ్జరీ కార్లని విక్రయిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. మరి ఈ ఇష్యూపై పృథ్వీరాజ్ కాని, దుల్కర్ కాని ఇప్పటి వరకు స్పందించింది లేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ ఇద్దరు నటుల ఇళ్లలో మాత్రమే కాకుండా కేరళ వ్యాప్తంగా కోచి, కొజికోడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల ద్వారా కొన్నేళ్లుగా జరుగుతున్న లగ్జరీ కార్ల అక్రమ రవాణాపై అధికారులు మరింత లోతుగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒకవైపు కస్టమ్స్ అధికారులు, మరోవైపు ఈడీ దాడులతో పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.