Dude | తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ తర్వాత తాజాగా విడుదలైన ‘డ్యూడ్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రదీప్‌కు హ్యాట్రిక్ హిట్ అందించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరి, తమిళ్, తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. ‘లవ్ టుడే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకున్నాడు. ‘డ్రాగన్’ విజయంతో స్టార్ హీరోల సరసన నిలిచిన ప్రదీప్ ఇప్పుడు ‘డ్యూడ్’తో దుమ్ము రేపుతున్నాడు. యూత్ ఆడియన్స్‌లో సినిమా పట్ల క్రేజ్ పెరిగిపోగా, థియేటర్లో చూడలేని వారు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
‘డ్యూడ్’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ స్లాట్‌ను సిద్ధం చేసుకుందని, ఆ వారం మరే పెద్ద సినిమా లేకుండా ప్రత్యేకంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డ్యూడ్ సినిమా కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ మేరకు డబ్బింగ్ పనులు తుదిదశలో ఉన్నాయని సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశీ ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించే అవకాశం ఉంది.
ప్రదీప్ రంగనాథన్ మమిత బైజు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కీర్తీశ్వరన్ తెరకెక్కించాడు. కథ పరంగా ఇది అల్లు అర్జున్ ‘ఆర్య 2’ నుంచి ప్రేరణ పొందినట్లు దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. అయితే, కథను నేటి యూత్ రుచులకు అనుగుణంగా మార్చి, కొత్తగా చూపించడంలో విజయం సాధించాడు. సీనియర్ నటుడు ఆర్. శరత్‌కుమార్ పోషించిన కీలక పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన నటన సినిమాకి బలం చేకూర్చిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో దుమ్మురేపిన ‘డ్యూడ్’ , ఓటీటీలో మరింత రీచ్ సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.