“డ్యూడ్’ ఓ విభిన్న ప్రేమకథా చిత్రం. ఇందులో కొన్ని బ్యూటీఫుల్ మూమెంట్స్ ఉంటాయి. అవి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా బాగా నచ్చుతాయి. ఈ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం’ అన్నారు అగ్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వారు నిర్మించిన ‘డ్యూడ్’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.
వారు మాట్లాడుతూ ‘ప్రదీప్ రంగనాథన్ గత చిత్రం ‘డ్రాగన్’ తమిళంలో 31కోట్ల షేర్ చేసింది. దాంతో ‘డ్యూడ్’కు తమిళంలో థియేట్రికల్ బిజినెస్ ఎక్కువగా జరిగింది. తమిళంలో మేము సొంతంగా రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. తమ సంస్థలో కథల ఎంపిక గురించి చెబుతూ ‘స్టోరీ సెలక్షన్ కోసం మా సంస్థ వద్ద మంచి టీమ్ ఉంది. వాళ్లు కథ విని బాగుందనిపిస్తే మా దగ్గరకు తీసుకొస్తారు. మేమంతా డిస్కస్ చేసుకొని ఫైనల్ చేస్తాం’ అని అన్నారు. ‘డ్యూడ్’ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని, ‘సఖీ’ తరహాలో హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయని తెలిపారు. తమ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రాల విశేషాల గురించి నవీన్ యెర్నేని, రవిశంకర్ మాట్లాడారు.
ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (రెండు టైటిల్స్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రాలను వచ్చే ఏడాదిలోనే విడుదల చేస్తామన్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని తెలిపారు. ఈ ఏడాది దీపావళి బరిలో నాలుగు చిత్రాల మధ్య ఉన్న కాంపిటీషన్ గురించి మాట్లాడుతూ ‘మేము సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో ఉన్నాం. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నాం కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం’ అని నవీన్ యెర్నేని, రవిశంకర్ అన్నారు.