DRISHYAM 3 | మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్నఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుతు మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో రీమేక్ చేశారు. ఆ రెండు భాగాలూ సూపర్‌హిట్ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీ వెర్షన్లో దృశ్యం 3 సినిమా రూపొందుతుందని అజయ్ దేవగణ్ ప్రకటించడంతో అందరిలో అనేక అనుమానాలు కలిగాయి. మలయాళం, హిందీలో వేర్వేరు కథలతో దృశ్యం 3 వస్తుందని అంతా భావిస్తున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ.. మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం-3 వస్తుందని వెల్లడించారు. ‘దృశ్యం 3’ని ఒకే కథతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తాం. మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.. స్టార్స్ కాల్షీట్స్ వలన పలు సమస్యలు వస్తాయి. అందుకే వారి అనుకూలతని బట్టి షూట్ చేస్తారు. అయితే చిత్రాన్ని మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేస్తాం. ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తయ్యాక హిందీ టీమ్‌కు అందిస్తాం.. అక్కడ పరిస్థితులకు తగినట్లుగా మేకర్స్ మార్పులు చేస్తారు అని జీతూ జోసెఫ్ చెప్పుకొచ్చారు.
ఇక దృశ్యం తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్లో కథానాయకుడిగా మోహన్‌లాల్, తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ నటించారు. మలయాళంలో రెండు భాగాలకూ జీతూ జోసెఫ్ దర్శకుడు.మరి ‘పార్ట్3’కి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక హిందీలో ‘దృశ్యం’ను నిషికాంత్ కామత్, ‘దృశ్యం2’ అభిషేక్ పాఠక్ తెరకెక్కించారు. ఈ సారి హిందీలో మూడో భాగానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.