వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోహీరోయిన్లు ధర్మ, ఐశ్వర్య తమ పాత్రలకు ప్రాణం పోశారని, యువతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకే కొంత యూత్‌ఫుల్ కంటెంట్‌ని ఈ కథలో పెట్టాల్సొచ్చిందని, నిజానికి ఇది అన్ని వర్గాలు మెచ్చే కథ అని, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ధర్మ, ఐశ్వర్య శర్మ ఆనందం వెలిబుచ్చారు. ట్రైలర్లో ఎంత ఇంట్రస్టింగ్ కంటెంట్ ఉందో, అంతకు మించి సినిమాలో ఉంటుందని, నరేట్ చేసిన దానికంటే అద్భుతంగా సినిమాను దర్శకుడు కిరణ్ తీశాడని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ అంతా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్.ఎస్.కాంచి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి.