తాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘డాన్ 3’ సినిమా విషయంపై నటుడు, దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్.. ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. రణవీర్‌సింగ్ కథానాయకుడిగా ఆయన ‘డాన్ 3’ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే.. సృజనాత్మక విభేదాల కారణంగా రణవీర్‌సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో వివాదం నెలకొన్నది. రణవీర్ నిష్క్రమణ కారణంగా తన సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్కు 40కోట్ల నష్టం వాటిల్లిందంటూ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫర్హాన్ అక్తర్ మాట్లాడుతూ ‘ఊహించని వాటికి కూడా సిద్ధంగా ఉండాలని నేర్చుకున్నాను.
ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా అధిగమించే పరిపూర్ణత నాకుంది. ఈ సినిమా నిర్మాణం అనుకున్న విధంగా ముందుకు సాగనప్పటికీ అద్భుతమైన కథల్లో ఇదొకటి. ఈ ైస్టెలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఎవరిని ఎంచుకుంటే వాళ్లు అదృష్టవంతులు. అద్భుతంగా తీసి తీరతాను’ అంటూ నమ్మకంగా చెప్పారు ఫర్హాన్. ఈ విషయంపై రణవీర్‌సింగ్ స్పందన వేరేలా ఉంది. ఫర్హాన్ ‘డాన్ 3’ కంటే ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని, ‘ధురంధర్’ తర్వాత కూడా ఆయన్ని సంప్రదించానని రణవీర్ పేర్కొన్నారు. మరి ఈ వివాదానికి ముగింపు ఏమిటో చూడాలి.