స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ ఈ పేరు వినగానే అందరికి కామెడీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే నిజానికి ఈవీవీ కేవలం కామెడీ చిత్రాలే కాదు యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్నీ తరహా చిత్రాలను తన దైన శైలిలో తెరకెక్కించేవారు. తెలుగు సినీ పరిశ్రమలో జంధ్యాల తరువాత ఆయన వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో ఈవీవీ ఓ ప్రత్యేక శైలి. ఆయన సినిమా అంటే కాసేపు నవ్వుకుని హాయిగా కాసేపు సేద తీరవచ్చు అనుకునే వారు అందరూ.
చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన అప్పుల అప్పారావు, జంబలకిడి పంబ, ఆ ఒక్కటి అడక్కు, ఆమె, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, కితకితలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన 50పైగా చిత్రాల్లో విజయాలే ఎక్కువ. ఇక ఆయన కెరీర్ కూడా ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. అయితే తను పవన్ కల్యాణ్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశంతో ఎలా వచ్చిందో గతంలో ఓ సారి చెప్పుకొచ్చారు ఈవీవీ.
చిరంజీవితో చంటబ్బాయి తీసినప్పుడు తొలిసారి చిరంజీవితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత మళ్లీ ఆయనతో అల్లుడా మజాకా చిత్రం చేసే వరకు పెద్దగా కమ్యూనికేషన్ లేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మా మధ్య కాస్త బంధం బలపడింది. ఆ సినిమా తీస్తున్నప్పుడు నా టేకింగ్ నచ్చి మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ కల్యాణ్‌ని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు. అలా పవన్ కల్యాణ్‌తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఈ సందర్భంగానే ఆయన చెబుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో మొదట్లో బ్రహ్మానందం పాత్రకు సుత్తివేలు అనుకున్నారు. కానీ ఆయన వేరే సినిమాలతో బిజీగా వున్నారు. దాంతో నేను బ్రహ్మానందంతో చేయిద్దామన్నాను. అప్పటికీ సత్యాగ్రహంలో బ్రహ్మానందాన్ని పరిచయం చేసింది జంధ్యాలే. కానీ ఆయన సుత్తివేలు కాస్త ఫ్రీ అయ్యే వరకు ఆగుదామన్నారు. నేను జంధ్యాలకు నచ్చజెప్పి సత్యగ్రహంలో బ్రహ్మానందం సన్నివేశాలు కొన్ని నిర్మాత రామానాయుడుకు చూపించి ఒప్పించాను. అలా బ్రహ్మానందంకు అహ నాపెళ్లంట చిత్రంలో అవకాశం వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం బ్రహ్మానందం కెరీర్‌కు ఎంత ప్లస్ అయ్యిందో అందరికి తెలిసిందే.