తారాగాణం: సిద్ధు జొన్నగలడ్డ, నేహాశెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ప్రగతి తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: తమన్
మాటలు: సిద్ధు జొన్నలగడ్డ
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: విమల్‌కృష్ణ
కరోనా లాక్డౌన్ ఆంక్షల నడుమ ఇటీవలకాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. దీంతో అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఈ సంధికాలంలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్తో ముందుకొస్తున్నాయి. అదే కోవలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ను తెరకెక్కించింది. ప్రచార చిత్రాలు, పాటల ద్వారా ఈ సినిమాకు యువతలో మంచి హైప్ క్రియేట్ అయింది. గుంటూరు టాకీస్, కల్కి, సిద్ధు అండ్ హిజ్ లీలా.. చిత్రాల ద్వారా టాలెంటెడ్ యంగ్‌హీరోగా గుర్తింపును తెచ్చుకున్న సిద్ధు..దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని పలకరించారు. చిన్న సినిమా అయినా భారీ హైప్ మధ్య విడుదలైన ‘డీజీ టిల్లు’ ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం..
డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) హైదరాబాద్ లోకల్ డీజేగా పనిచేస్తుంటాడు. దేశభక్తి
స్ఫురించేలా బాలగంగాధర్ తిలక్ అని తండ్రి అతనికి పెట్టిన పేరును మ్యూజిక్ పట్ల ఉండే పాషన్ వల్ల డీజే టిల్లుగా మార్చుకుంటాడు. స్థానికంగా జరిగే మహంకాళి జాతర, సీమంతాలు, పెళ్లి బరాత్‌లలో డీజే వాయిస్తూ సరదాగా జీవితాన్ని వెళ్లదీయడం సిద్దు నైజం. పైకి హుషారుగా కనిపించినప్పటికీ సిద్ధులో తెలియని అమాయకత్వం కూడా ఉంటుంది. ఓ బార్లో సిద్ధుకు..రాధికతో (నేహాశెట్టి)పరిచయం ఏర్పడుతుంది. ఒక్క రాత్రిలోనే వారు దగ్గరవుతారు. పుట్టినరోజు సందర్భంగా రాధికను తన ఇంటికి ఆహ్వానిస్తాడు సిద్ధు. తాను రాలేనని చెప్పడంతో సిద్ధు ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళతాడు. అక్కడ అనూహ్యంగా మర్డర్‌కేసులో చిక్కుకుంటాడు. దాని నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాల్లో సిద్ధు, రాధిక అనూహ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? మర్డర్‌ను బూచీగా చూపిస్తూ వారిద్దరిని బ్లాక్మెయిల్ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు. అసలు వారెవరు? సిద్ధు హత్యలో ఎందుకు ఇరుక్కున్నాడు? అమాయకంగా మర్డర్ ఉచ్చులో చిక్కుకున్న సిద్ధు తన తెలివితేటల్ని ఉపయోగించి దాని నుంచి ఎలా బయటపడ్డాడన్నదే మిగతా కథ..
సరదాగా జీవితాన్ని గడిపే కథానాయకుడు అనూహ్యంగా మర్డర్ కేసులో చిక్కుకోవడం…అందులో నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో లెక్కకుమించిన కథలొచ్చాయి. ‘డీజే టిల్లు’ స్టోరీలైన్ పరంగా అలాంటిదే అనిపించినా…హీరో క్యారక్టరైజేషన్ ఈ సినిమాకు పెద్దప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న డీజే టిల్లు పూర్వజీవితం, లైఫ్ైస్టెయిల్ గురించి అతని తండ్రి చెబుతున్న సన్నివేశాలతో కథను ఆరంభించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్‌లోనే సిద్ధు ్ద మనస్తత్వం ఏమిటో పరిచయం అవుతుంది. రాధికతో అనుకోని ఎఫైర్..అనంతరం టిల్లు మర్డర్ మిస్టరీలో చిక్కుకోవడంతో కథ ఊపందుకుంది. అయితే సీరియస్ సన్నివేశాల్లో కూడా చక్కటి కామెడీని పుట్టించడంపైనే దర్శకుడు దృష్టిపెట్టాడు. శవాన్ని పూడ్చి పెట్టడానికి టిల్లు, రాధికా చేసే ప్రయత్నాల్లో ఉత్కంఠ కంటే వారి మధ్య జరిగే సంభాషణలో మంచి ఫన్క్రియేట్ చేశారంటే.. దర్శకుడు ఈ సినిమాను ఏ లక్ష్యంతో తీశారో అర్థమవుతుంది.
ప్రథమార్థమంతా సిద్ధు చేసే హంగామాతో నవ్వుల్ని పండించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ద్వితీయార్థమంతా సిద్ధు క్రైమ్ నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో సాగుతుంది. హాస్పిటల్లో కోమా నుంచి కోలుకున్న సిద్ధు గతాన్ని మర్చిపోయిన వాడిగా ప్రవర్తించడం..ఈ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ కన్విన్సింగ్‌గా అనిపించలేదు. మర్డర్ మిస్టరీ తాలూకు చిక్కుముళ్లను విప్పడం…సిద్ధు తన తెలివితేటలతో బ్లాక్మెయిల్ చేసిన వారి భరతం పట్టే ఎపిసోడ్స్‌తో సెకండాఫ్‌ను నడుస్తుంది. ప్రీైక్లెమాక్స్లో వచ్చే కోర్డ్ రూమ్ సన్నివేశాలు కూడా మంచి వినోదాన్ని పంచాయి. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలో కథాగమనం కాస్త మందగించినట్లుగా కనిపిస్తుంది. ైక్లెమాక్స్ ఘట్టాల్లో సిద్ధు ఆడిన మైండ్‌గేమ్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సీక్వెల్ ఉంటుందనే హింట్‌తో ఈ సినిమా కథను ముగించారు.
ఎవరెలా చేశారంటే..
ఓ సాధారణ క్రైమ్ ఎలిమెంట్‌తో దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో పాత్ర చిత్రణపైనే ఫోకస్ పెడుతూ కథను నడిపించారు. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనదైన హావభావాలు, మేనరిజమ్స్‌తో సినిమాకు వన్మేన్షోగా నిలిచారు. టిపికల్ హైదరాబాదీ యువకుడిగా ఆయన తెలంగాణ యాసలో పలికిక సంభాషణలు..అందులోంచి పుట్టిన చక్కటి హాస్యం ప్రేక్షకుల్ని ఆసాంతం నవ్విస్తుంది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతమనిపిస్తుంది. కథానాయిక నేహాశెట్టికి పెద్దగా అభినయానికి ఆస్కారం లేకుండా పోయింది. తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేసింది. కథలో కీలకమైన పాత్రల్లో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ప్రిన్స్ మంచి నటనను కనబరిచారు. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
శ్రీచరణ్ పాకాల స్వరపరచిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ హుషారైన బీట్తో ఆకట్టుకుంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేస్తూ సాగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఈ చిత్ర సంభాషణల్ని హీరో సిద్ధు జొన్నగడ్డ రాశారు. హైదరాబాదీ ైస్టెల్ ఫన్, పంచ్‌లతో డైలాగ్స్ అన్నీ బాగా పండాయి. ద్వితీయార్థంలో అక్కడక్కడా కాస్త పట్టుతప్పినా.. వినోదాల డోస్ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు విమల్‌కృష్ణ కథను తీర్చిదిద్దడంలో సఫలీకృతుడయ్యారు.
తీర్పు:
యూత్‌ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా ఆద్యంతం ఫన్రైడ్లా అనిపిస్తుంది. లాజిక్లను పక్కనబెతితే హాయిగా నవ్వుకోవచ్చు. ఈ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు తమ అంచనాల్ని అందుకున్నారనే చెప్పొచ్చు..
రేటింగ్ : 3/5