Divorce |సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇప్పుడు కొత్తేమీ కాదు. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, మరికొంతమంది ఆరు నెలలకే వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇంకొందరు ఏళ్ల తరబడి కలిసి జీవించి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా సడన్‌గా విడాకులు తీసుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో నటుడు చేరారు. టాలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటుడు షిజు ఏఆర్ తన 17 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ఆయనే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడం గమనార్హం. ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షిజు తన ప్రకటనలో, నేను, ప్రీతి ప్రేమ్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. భార్యాభర్తలుగా విడిపోయినా, మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎలాంటి పుకార్లు సృష్టించవద్దు” అని పేర్కొన్నారు.మలయాళ నటుడిగా కెరీర్ ప్రారంభించిన షిజు ఏఆర్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘దేవి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలోనే ఈ విడాకుల వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
షిజు – ప్రీతి ప్రేమ్ల ప్రేమకథ కూడా ఆసక్తికరమే. అనుకోకుండా పరిచయమైన ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకుని సినిమా స్టైల్లో ప్రపోజ్ చేసుకున్నారు. అప్పట్లో షిజు హీరోగా పని చేస్తుండగా, ప్రీతి ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసేవారు. షిజు ముస్లిం, ప్రీతి క్రిస్టియన్ కావడంతో ఇంట్లో ఒప్పుకోరేమో అనే భయంతో తొలుత ఆందోళనకు గురయ్యారట. అయితే మతం కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి, ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించడంతో 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వారికి ఒక కూతురు పుట్టడంతో ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఆపై కూతురు సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం కూడా చేసుకున్నారు. ఇంత బలమైన ప్రేమ, 17 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు ఈ జంట విడిపోవడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.