బాలీవుడ్లో ప్రేమ పక్షులకు కొదవేం లేదు. ఒకట్రెండు సినిమాలు కలిసి నటించిన హీరో హీరోయిన్లు వ్యక్తిగతంగా సన్నిహితులుగా మెలగడం అక్కడ సహజమే. ఇది ప్రేమకూ దారి తీసిన సందర్భాలెన్నో. ‘భాఘీ’ చిత్ర సిరీస్‌లో కలిసి నటించిన టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ఇలాంటి ప్రేమ జంటల్లో ఒకటే. వాళ్ల ప్రేమ ప్రయాణం సుదీర్ఘంగా సాగుతున్నది. అయితే ప్రేమ నుంచి పెళ్లికి ప్రమోషన్ తీసుకుందామని దిశా పటానీ ప్రపోజ్ చేయగా…టైగర్ వద్దన్నాడట. ఇదే ఈ ప్రేమ జంట దూరమవడానికి కారణమని చెప్పుకున్నారు. ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని దిశా అనుకోగా..కొన్నాళ్లు ఈ పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండాలని టైగర్ భావిస్తున్నాడట.
ఈ భిన్నాభిప్రాయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. తాము కలిసి ఉన్నట్లు తాజాగా సూచన చేసింది దిశా. టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ అందులో భాగంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇవాళ ట్రైనింగ్ తీసుకునే మూడ్ లేదు. అందుకే హ్యూమన్ పంచింగ్ బ్యాగ్‌లా మా శిక్షకులను కిక్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు స్పందించిన దిశా..‘నాకూ అలా చేయాలని ఉంది’ అని కామెంట్ చేసింది. దీంతో వీళ్ల మధ్య దూరం కల్పితమేనని తెలుస్తున్నది. ప్రస్తుతం దిశా పటానీ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా..టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’, ‘ర్యాంబో’, ‘స్క్రూ డీలా’, ‘బడే మియా ఛోటే మియా’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.