Disco Shanti | తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో ఎనభై, తొంభై దశకాల్లో తన డ్యాన్స్ లు, హుషారైన నటనతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన డిస్కో శాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగాను, డ్యాన్సర్గాను అప్పట్లో ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత ఆమె నటనను మళ్లీ ఆస్వాదించే అవకాశం సినీ అభిమానులకు లభించనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బుల్లెట్’ చిత్రంతో డిస్కో శాంతి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో రాఘవ సోదరుడు ఎల్విన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
దర్శకుడు ఇన్నాసి పాండియన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.శుక్రవారం విడుదలైన టీజర్ ద్వారా డిస్కో శాంతి పాత్రపై కొంత క్లారిటీ రాగా, ఇందులో జోస్యం చెప్పే పాత్రలో ఆమె కనిపించనున్నారు. టీజర్ ప్రారంభంలో డిస్కో శాంతి మన జీవితంలో జరిగే ప్రతి విషాదం, గతంలో ఎక్కడో ఒకచోట కచ్చితంగా జరిగి ఉంటుంది అని చెప్పడం ఆకట్టుకుంది. ఈ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
డిస్కో శాంతి అసలు పేరు శాంత కుమారి కాగా, ఆమె తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తె. 900కి పైగా సినిమాల్లో నటించిన డిస్కో శాంతి తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో కూడా నటించి తన ప్రతిభను చాటారు.1996లో టాలీవుడ్ యాక్షన్ హీరో శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. శ్రీహరి- డిస్కోశాంతి దంపతులకి ముగ్గురు సంతానం. కుమార్తె అక్షర చిన్న వయసులో మరణించగా, ఆమె జ్ఞాపకార్థంగా అక్షర ఫౌండేషన్‌ని స్థాపించారు. గ్రామాలకి మంచి నీరు, విద్యార్థులకు పాఠశాల సామాగ్రి అందిస్తూ వస్తున్నారు. ఇక డిస్కో శాంతి భర్త శ్రీహరి 2013లో కాలేయ వ్యాధితో మృతి చెందారు.