తమిళంలో సంచలన విజయం సాధించిన ‘విడుదల’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘విడుదల-2’ ఈ నెల 20న ప్రేక్షకులముందుకొస్తోంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై నిర్మాత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సామాన్యుల నుంచి ఉద్భవించిన ఓ అసామాన్యుడి వీర విప్లవ కథాంశమిది. తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఓరకంగా తమిళ దర్శకుడు తీసిన తెలుగు కథ అనుకోవచ్చు. మన నేటివిటీకి బాగా సరిపోయింది’ అన్నారు. ఈ సినిమాలో పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి విశ్వరూపం చూస్తారని, నక్సలైట్ పాత్రలో ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయని, ఇళయరాజా సంగీతం ఈ కథకు ప్రాణం పోసిందని చింతపల్లి రామారావు పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా విడుదల చేసిన ‘మహారాజ’ అద్భుత విజయం సాధించిందని, ఆ కోవలోనే ఈ సినిమా సైతం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉందని, తొలిభాగానికి పదిరెట్లు భావోద్వేగాలతో ఈ సినిమా మెప్పిస్తుందని ఆయన తెలిపారు. తమ బ్యానర్‌పై ‘శ్రీశ్రీ రాజావారు’ విడుదలకు సిద్ధంగా ఉందని, త్వరలో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టబోతున్నామని ఆయన చెప్పారు.