వాషింగ్టన్: కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ పీహెచ్డీ విద్యార్థులు ఆదిత్య ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య వివక్షపై పోరాడి, విజయం సాధించారు. ఈ విశ్వవిద్యాలయం వీరిద్దరితో సివిల్ రైట్స్ సెటిల్మెంట్ చేసుకుని, రూ.1.8 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ప్రకాశ్ 2023 సెప్టెంబర్‌లో తాను తీసుకెళ్లిన ఆహారాన్ని డిపార్ట్మెంట్ మైక్రోవేవ్‌లో వేడి చేసేందుకు ప్రయత్నించారు. సిబ్బంది ఒకరు వచ్చి, పాలక్ పనీర్ ఘాటు వాసన వస్తున్నదని, దానిని వేడి చేయవద్దని చెప్పాడు. ప్రకాశ్ స్పందించి, “ఇది ఆహారం, వేడి చేసుకుని, వెళ్లిపోతాను” అని చెప్పారు. ఆ తర్వాత ప్రకాశ్ (34), భట్టాచార్య (35) కొలరాడోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో దావా వేశారు. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తుండటంపై ప్రకాశ్ ఆందోళన వ్యక్తం చేయడంతో విశ్వవిద్యాలయం ప్రతీకార చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. డిపార్ట్మెంటల్ కిచెన్ రూల్స్ దక్షిణాసియా వారిని వేరుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. కామన్ ఏరియాల్లో తమ లంచ్ బాక్స్‌లను తెరవకుండా నిరుత్సాహ పరుస్తున్నాయని పేర్కొన్నారు.