Sailesh Kolanu | టాలీవుడ్లో ‘హిట్ (HIT)’ ఫ్రాంచైజీ, ‘సైంధవ్’ వంటి విలక్షణమైన చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శైలేష్ కొలను ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. వెండితెరపై తన మార్క్ మేకింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు కలం పట్టి రచయితగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సోమవారం సరస్వతీ పూజ సందర్భంగా ఆయన తన సరికొత్త పుస్తక రచనకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ కథ శైలేష్ హృదయానికి ఎంతో నచ్చినది మాత్రమే కాకుండా, ఆయన నిజ జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోందని సమాచారం.
ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్స్‌లో డాక్టరేట్ (PhD) సాధించిన సైంటిస్ట్ అయిన శైలేష్ కొలను, ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్ 2’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లతో దర్శకుడిగా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ కాంబినేషన్లో ‘ఏమో ఏమో ఇది’ అనే సరికొత్త రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా రంగంలోనే కాకుండా ఎంతో ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ నోట్‌తో సాగే తన నిజ జీవిత అనుభవాల పుస్తకంతో రీడర్స్‌ను ఆయన ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ సందర్భంగా రచయితగా సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన డైరెక్టర్ శైలేష్ కొలనుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.