‘చిన్నప్పట్నుంచీ విన్న పురాణ ఇతిహాసాలనూ, వాటిలోని ఉత్సాహవంతమైన అంశాలనూ ప్రేరణగా తీసుకుని ‘మిరాయ్’ కథ తయారు చేశాను. ఇది మన మూలాలను గుర్తు చేసే కథ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చే సినిమా ఇది.’ అని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అన్నారు. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా సూపర్ యోధగా నటించిన పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్‌గా ఇందులో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయని పెద్దలంటుంటారు. అవి దుష్టుల బారిన పడితే, వాటిని ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడొచ్చనేదే ‘మిరాయ్’ కథ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం పురాణ ఇతిహాసాల్లో దొరుకుతుందనే నమ్మకంతో ఈ కథ చేశాను. ఇదొక పూర్తి ఫిక్షన్‌తో కూడిన యాక్షన్ అడ్వెంచర్. డిఫరెంట్ ప్రాసెస్‌లో ఈ సినిమా చేశాం. శ్రీలంక, రాజస్తాన్, బుర్జు, థాయిలాండ్ ఇలా ఆసియా అంతా తిరిగేశాం.
మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో రియల్ లొకేషన్స్‌లో నటీనటులందర్నీ తీసుకెళ్లి షూట్ చేశాం. ఒక్క సీనియర్ యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. అందరూ సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది.’ అని తెలిపారు కార్తిక్ ఘట్టమనేని. ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్సులుంటాయని, తేజ సజ్జా, మనోజ్ వీటికోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించారని, తేజ సజ్జాకు ఈ సినిమా మరో బ్రేక్ అవుతుందని, మంచు మనోజ్‌లో కనిపించే సహజ దూకుడు తత్వం ఈ సినిమాకు ఉపయోగపడిందని, ఊహించని ఎన్నో అంశాలు ‘మిరాయ్’లో ఉంటాయని, సాంకేతికంగా ఇదో అద్భుతమని కార్తీక్ ఘట్టమనేని తెలిపారు.