Gymkhaana Pre Release Event | టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ తెలుగు ప్రేక్షకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు బానే చూస్తారు. కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు హరీశ్.
మలయాళంలో బాక్సాఫీస్ హిట్గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ సినిమా హిట్టు అవ్వాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. నేను డ్రాగన్ సినిమా అప్పుడు చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు తప్ప అన్ని సినిమాలు చూస్తారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరూ తప్పుబడుతూ.. మీ సినిమాలు బాగుంటే చూసేవాళ్లు లేవు కాబట్టే ఇతర భాష సినిమాలు చూస్తున్నారంటూ నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నేను పట్టించుకోలేదు. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను కూడా ఆదరించడంటూ హరీశ్ చెప్పుకోచ్చాడు.