సక్సెస్‌ని క్యాష్ చేసుకోవడం దర్శకుడు గుణశేఖర్‌కి తెలియదు. ట్రెండ్‌కి ఎదురెళ్లే దర్శకుడాయన. ఒక దర్శకునిగా తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో.. దాని కోసం ఎంతదూరమైనా వెళ్లే తెగింపు గుణశేఖర్ సొంతం. ఆయన కెరీర్‌ని ఆసాంతం గమనిస్తే అది ఎంత నిజమో అర్థమవుతుంది. గుణశేఖర్ కెరీర్లో చూడాలనివుంది, ఒక్కడు లాంటి కల్ట్ హిట్స్ ఉన్నాయి. అలాగే దారుణమైన ఫ్లాపులూ ఉన్నాయి. దేన్నయినా ఒకేలా స్వీకరించే తత్వం గుణశేఖర్ సొంతం. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారాయన. ఆ వివరాలివి.
ప్రత్యేకించి పుట్టినరోజులు జరుపుకోవడం నాకిష్టం ఉండదు. కానీ ‘యుఫోరియా’ లాంటి సినిమా తీసిన తర్వాత, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనిపించింది. నిజానికి ‘యుఫోరియా’ పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో పెద్ద హిట్. ఇంట్లో ఈ సినిమాను చూసిన చాలామంది ‘థియేటర్లో చూడనందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. సమాజంలో గోప్యంగా జరుగుతున్న ఘోరాలను ఎత్తి చూపే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తగా మెలగాలని తెలిపే ఇలాంటి సినిమాల అవసరం ఎంతైనా ఉందని ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. ఒక దర్శకుడికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి?
నిర్మాణరంగంలోకి రావడం రిస్క్ అనిపించలేదా? అని చాలామంది అడుగుతున్నారు. రిస్క్ అని తెలుసు. తెలిసే అడుగుపెట్టాను. నా అభిరుచికి తగ్గ కథల్ని జనానికి చెప్పాలని నాకు ఉంటుంది. కానీ అలాంటి సినిమాలను నిర్మించే నిర్మాతలు దొరకలేదు. అందుకే నా కథల్ని చెప్పడానికే నేను నిర్మాత నయ్యాను. దాని వల్ల నేను నష్టపోవచ్చు. కానీ నేనేం బాధపడను. ఎందుకంటే అది నా నష్టం. నా వల్ల నాకు కలిగిన నష్టం నన్నెప్పుడూ బాధించదు. ‘శాకుంతలం’ డ్రై సబ్జెక్ట్. దాన్ని కోవిడ్ టైమ్‌లో ఓటీటీకి తీద్దామనుకున్నాను. కానీ తర్వాత గ్రాండియర్‌గా థియేటర్లకే చేయొచ్చుకదా అనిపించింది. అది సరైన నిర్ణయం కాదని ఆ సినిమా ఫలితం చెప్పింది. అయితే.. ‘యుఫోరియా’ విషయంలో మాత్రం నేను అస్సలు బాధపడలేదు. ఇంకా ఆనందంగా ఉన్నా. ఇలాంటి కథలు నానుంచి మరిన్ని వస్తాయి.
త్వరలో నేను చేయబోతున్న సినిమా ‘ఒక్కడు’ తరహాలోనే మాస్ ఎలిమెంట్స్‌తో, సమాజంలో నెలకొని ఉన్న ఓ సమస్య చూట్టూ నడుస్తుంది. ఓ స్టార్ హీరోతో ఆ సినిమా చేస్తా. ఇదిగాక ఇంకా నా దగ్గర మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి పీరియాడిక్ మూవీ. భారీ బడ్జెట్‌తో చేయాల్సిన సినిమా అది. దానికి వేరేవారి భాగస్వామ్యం అవసరం. నా కుమార్తెలు నీలిమ, ఏక్త నిర్మాతలుగా వేరే దర్శకుడితో ఓ సినిమా చేస్తాను. కథ మాత్రం నాదే.