టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్బీకే 108గా పిలిచే ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రకటించారు. బాలకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు ఇటీవల తన ‘ఎఫ్ 3’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో వెల్లడించారు దర్శకుడు అనిల్ రావిపూడి. అటు బాలకృష్ణ కూడా అనిల్‌తో సినిమా చేస్తున్నట్లు తెలిపారు.
కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తన తొలి సినిమా ‘పటాస్’ విజయవంతం అయినప్పటి నుంచే బాలకృష్ణతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు నిర్మాణ సంస్థను ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటున్నది.