Yellamma | ‘ఎల్లమ్మ’ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు యూడుగంటి (వేణు బలగం) రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్ల భారీ అంచనాలు ఉండగా, రెండేళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్, ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు.తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆయనే తప్పుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని నితిన్ స్వయంగా ప్రకటించారు.
కానీ కొన్ని రోజులకే ఆయనను కూడా ఈ చిత్రం నుంచి తప్పించారని సమాచారం. ఇలా వరుసగా ముగ్గురు హీరోలు మారడంతో ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరకు ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మ సినిమాకు హీరో ఇప్పటికే ఫైనల్ అయ్యాడు. త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. అలాగే హీరోయిన్ వివరాలు కూడా డిసెంబర్లో వెల్లడిస్తాం. మా బ్యానర్ నుంచి 2026లో ఆరు సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’ షూటింగ్ జరుగుతోంది” అని తెలిపారు.
దీంతో ‘ఎల్లమ్మ’ సినిమాను ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్ని మార్పుల తర్వాత కూడా ప్రాజెక్ట్ నిలిచేలా ఉండటం మేకర్స్ నమ్మకాన్ని చూపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు కొత్త హీరో, హీరోయిన్ ఎవరన్న దానిపైనే ఉంది.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే దానిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. కొద్ది రోజుల క్రితం బలగం అనే చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వేణు ఇప్పుడు తన రెండో చిత్రంతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.