ముంబై: శరత్ సక్సేనా (Sharat Saxena)..! ఆయన ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలు పోషించి మెప్పించాడు. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో కూడా ఆయన విలన్‌గా నటించాడు. సినిమా రంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. ఇంత చేసిన శరత్ సక్సేనా.. తనకు తన మొహం అస్సలు నచ్చేది కాదని చెబుతున్నాడు.
తన మొహం తనకు ఎప్పుడూ నచ్చలేదని, అందుకే అద్దంలో మొహం చూసుకున్నప్పుడల్లా తనను తాను తిట్టుకునే వాడినని సక్సేనా వెల్లడించాడు. మొహం బాగా లేకనే కెరీర్ మొత్తం తాను ప్రతి నాయకుడి పాత్రలకు మాత్రమే పరిమితమయ్యానని చెప్పాడు. ‘నాకు ముందే తెలుస్తుంది.. ప్రతి సినిమాలో హీరో వస్తాడు, నన్ను కొడతాడు, ఆ తర్వాత తనను తాను హీరోగా ప్రకటించుకుని సినిమాలో ముందుకు వెళ్తాడు’ అని సక్సేనా తెలిపాడు. తన మొహం అందంగా లేకనే తాను విలన్ పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు.