DiaMirza | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూనే దేశ పర్యావరణ భవిష్యత్తుపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులోకి వస్తున్న అటవీ చట్ట సవరణలు ప్రకృతికి ఏ విధంగా ముప్పుగా మారతాయో ఈ సందర్భంగా ఆమె వివరించారు. ముఖ్యంగా 2023 అటవీ చట్ట సవరణల వల్ల ‘డీమ్డ్ ఫారెస్ట్’లకు రక్షణ కరువవుతుందని, పారిశ్రామిక ప్రయోజనాల కోసం పర్యావరణ క్లియరెన్సులను పక్కన పెట్టడం వల్ల భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన చెందారు.
ఈ కొత్త చట్టాల వల్ల భారతదేశంలోని సుమారు 20 శాతం నుంచి 25 శాతం అటవీ విస్తీర్ణం వాణిజ్య అవసరాల కోసం వినియోగించబడి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అడవులను రక్షించే ఆదివాసీల గొంతును నొక్కేయడం అంటే మన సామూహిక మనుగడను ప్రమాదంలో పడేయడమేనని ఆమె హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి వంటి పవిత్రమైన రోజున పౌరులందరూ తమ రాజ్యాంగ హక్కుల గురించి ఆలోచించడంతో పాటు, ప్రకృతిని రక్షించాలనే ప్రాథమిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.