Dhurandhar 2 | భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డులు నమోదు చేస్తూ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా ఈ మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా సంచలన రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, వాటిని మించి ప్రదర్శనతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వీక్ డేస్‌లో సినిమాల వసూళ్లు తగ్గడం సహజం. కానీ ఈ సినిమా మాత్రం సోమవారం నుంచి బుధవారం వరకు కూడా అదే జోరును కొనసాగిస్తూ, కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం.
గతంలో పుష్ప 2 హిందీ వెర్షన్ మొదటి వారంలో రూ.425 కోట్ల నెట్ వసూళ్లతో నెలకొల్పిన రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమించింది. ఒకే భాషలో అత్యంత వేగంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది కొత్త చరిత్ర రాసింది. తాజా లెక్కల ప్రకారం, వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన 10వ భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. కేవలం భారతదేశంలోనే తొలి వారం రోజుల్లో రూ.745 కోట్ల గ్రాస్ వసూలు చేయడం మరింత విశేషం. బాలీవుడ్లో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన చిత్రం ఇదే కావడం గమనార్హం.ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1471 కోట్ల గ్రాస్‌తో పుష్ప 2 టాప్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ‘ధురంధర్ 2’ దూకుడు చూస్తుంటే ఆ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, మరో కొద్ది రోజుల్లోనే దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ఈ సునామీ, భారతీయ సినిమా మార్కెట్ పరిమితులను మరింత విస్తరించడమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.