Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండో వారంలోనూ కలెక్షన్ల పరంగా స్ట్రాంగ్‌గా నిలుస్తోంది. విడుదలైన 12వ రోజు (మార్చి 30, రెండో సోమవారం) ఈ చిత్రం భారతదేశంలో రూ.25.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.872.17 కోట్లకు చేరగా, గ్రాస్ కలెక్షన్స్ రూ.1,042.23 కోట్లుగా నమోదయ్యాయి. ఇక విదేశీ మార్కెట్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఓవర్సీస్లో ఇప్పటికే రూ.350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ రూ.1,392.23 కోట్లకు చేరుకుని రూ.1400 కోట్ల మార్క్‌ను తాకడానికి చేరువలో ఉంది.
రెండో ఆదివారం (మార్చి 29) రూ.68.10 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సోమవారం నాటికి 62.8% తగ్గుదలని నమోదు చేసింది. థియేటర్ ఆక్యుపెన్సీ కూడా 48.5% నుంచి 22.6%కు పడిపోయింది. అయితే ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్ద సినిమాలకు వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్‌లో ఈ తరహా తగ్గుదల సహజమేనని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,592 షోలతో ధురంధర్ 2: ది రివెంజ్ ప్రదర్శింపబడుతోంది. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ పోషించిన గూఢచారి పాత్రకు విశేష స్పందన లభిస్తోంది. అతని హుందా నటన, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కారణంగానే చాలామంది ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ వీక్షిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, రెండో వారం వర్కింగ్ డేస్‌లో స్థిరంగా ఉన్నా, వచ్చే వీకెండ్లో మళ్లీ పుంజుకుంటే ఈ చిత్రం రూ.1500 కోట్ల మైలురాయిని సులభంగా దాటే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న ధురంధర్ 2: ది రివెంజ్ మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.