Akhil Next Movie | అఖిల్ ఎంట్రీకి జరిగిన హడావిడి బహుశా ఇండియాలో ఏ హీరోకు కూడా జరగలేదెమో. ‘మనం’ సినిమాలో గెస్ట్ రోల్‌కే బట్టలు చింపుకున్న అక్కినేని ఫ్యాన్స్.. ‘అఖిల్: ది పవర్ ఆఫ్ జువా’ సినిమాకు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో.. సరిగ్గా అదే స్థాయిలో అఖిల్ సినిమాకు పండగ వాతావరణం నెలకొంది. అక్కినేని ఫ్యాన్స్ అనే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు సైతం అఖిల్ సినిమా కోసం ఎగబడ్డారు. కట్ చేస్తే తొలిరోజే మిక్సుడ్ టాక్ తెచ్చుకుని ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత కొడుకుకు గట్టి హిట్టివ్వాలని నాగార్జున కోట్లు పెట్టి తీసిన హలో సైతం యావరేజ్ హిట్‌గానే నిలిచింది. ఇక మిస్టర్ మజ్ను గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
లుక్స్, డ్యాన్స్, నటన ఇలా అన్నీ ఉన్న అఖిల్‌కు మాత్రం కలిసి రావడం లేదు. ఈ క్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో తొలి హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ పాస్ అయింది. ఇక ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకుని ఏజెంట్ సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. సురేందర్ రెడ్డి దర్శకుడు కావడంతో కాస్తో కూస్తో మంచి హైపే నెలకొంది. ఇక ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుని బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.
పాత కథలనే మిక్సీలో వేసి మళ్లీ చూపించాడనే మచ్చను సురేందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. అయితే నటన పరంగా మాత్రం అఖిల్ ది బెస్ట్ అనిపించాడు. ఇక కష్టపడటం మన చేతిలో ఉంది కానీ, ఫలితం మన చేతిలో లేదు అనే సిద్ధాంతాన్ని నమ్మి అఖిల్ తన కొత్త సినిమా కోసం ముస్తాబయ్యాడు. అఖిల్ తన తదుపరి సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో చేయనున్నాడు. సాహో సినిమాకు ఆసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ధీర అనే టైటిల్‌ను యూవీ క్రియేషన్స్ రిజిస్టర్ చేయించనట్లు తెలుస్తుంది. ఇక టైటిల్‌ను బట్టి చూస్తే ఇదొక యాక్షన్ సినిమాలానే అనిపిస్తుంది. అయితే అఖిల్‌కు యాక్షన్ సినిమాలు ఏమంత అచ్చిరావు. తొలి సినిమా అఖిల్, చివరి సినిమా ఏజెంట్ రెండూ దెబ్బ కొట్టినవే. ఈ క్రమంలో మళ్లీ యాక్షన్ సినిమానే చేయడం కొంచెం రిస్క్ అని నెటిజన్లు అంటున్నారు. పైగా అఖిల్‌ను లవర్‌బాయ్‌గా చూడాలనే చాలా మంది అనుకుంటున్నారు. యాక్సన్ సినిమాలు అఖిల్‌కు సెట్ కావని, లవ్ స్టోరీలు చక్కగా కుదురుతాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే టైటిల్‌ను బట్టి సినిమా కథను అంచనా వేయలేం. మరి నిజంగానే ఇది యాక్షన్ సినిమానా.. లేదంటే వేరే జానర్ అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.