కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నతో కలిసి నటించాడు. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కుబేరా సినిమాకు స్టార్ వాల్యూ, టాప్ టెక్నిషియన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.
చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ వసూళ్లు కుబేర సులువుగా రాబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.శేఖర్ కమ్ములకు – చిరుకు మధ్య ఎంతో మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో మెగాస్టార్‌ని గెస్ట్‌గా ఆహ్వానించి ఉంటారు. ఇటీవల శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా శేఖర్ని సన్మానించారు చిరు. ఇక ఆ స్నేహం కారణంగానే చిరు.. ఈ సక్సెస్ మీట్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ధనుష్ ఆడిటోరియానికి రాగానే చిత్ర బృందాన్ని పలకరిస్తూ, మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చారు. ఆయనని చూడగానే పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక చిరు, ధనుష్ ను లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం కుబేరలోని ధనుష్ నటనపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి.. ధనుష్ నటనతో పాటు నాగార్జున, రష్మికల నటనని ప్రత్యేకంగా అభినందించారు. మరో ఆకట్టుకున్న అంశం ఏంటంటే యాంకర్ ముందు నాగార్జునని స్పీచ్ కోసం పిలవగా ధనుష్ వారించి తాను ముందు మాట్లాడతానని చెప్పడం పెద్దల పట్ల గౌరవాన్ని మరోసారి తేటతెల్లం చేసింది.