Dhanush Sir Movie Teaser | తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్లో అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక చిత్రం తర్వాత ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘సర్’ సినిమా ఒకటి. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
‘జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇప్పుడిదేరా ట్రెండ్’ అంటూ టీజర్ ప్రారంభమైంది. ‘మన కాలేజీలో ఉన్న బెస్ట్ లెక్చరర్స్‌ను గవర్నమెంట్ కాలేజ్‌లోకి పంపిస్తే మన దగ్గరకొచ్చి చదువుకునేది ఎవరు’. ‘మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్‌ను’ అంటూ వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘సర్ మై సెల్ఫ్ బాల గంగాధర్ తిలక్. త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్లో జూనియర్ లెక్చరర్. విధ్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేధ్యం లాంటిది సార్.. పంచండి. 5 స్టార్ హోటల్లో డిషెస్లాగా అమ్మకండి’ అంటూ ధనుష్ చెప్పే డైలాగ్స్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. టీజర్ మొత్తం ధనుష్ వన్ మ్యాన్ షోలా కనిపిస్తుంది. లెక్చరర్‌గా ధనుష్ యాక్షన్ సీన్లు వేరే లెవల్లో ఉన్నాయి.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’, ‘నానే వరువన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.