Dhanush | సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసుల అరంగేట్రం ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర సినీ ప్రవేశంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ధనుష్ స్వయంగా తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా తన కొత్త చిత్రం ‘కర’ ప్రమోషన్స్ సందర్భంగా ఈ విషయంపై ధనుష్ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం 16 ఏళ్లకే కుటుంబ పరిస్థితుల వల్ల సినీ రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని ధనుష్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తన కుమారుడు యాత్రకు 19 ఏళ్లు ఉన్నప్పటికీ, తనకి మాత్రం ఇంకా చిన్న పిల్లాడిలానే కనిపిస్తాడని అన్నారు.
యాత్ర భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను. అతను సినిమాల్లోకి వస్తాడా లేదా అన్నది పూర్తిగా అతని నిర్ణయం అని ధనుష్ వెల్లడించారు. దీంతో యాత్ర సినీ అరంగేట్రంపై ఉన్న ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. ఇక ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కర’ విషయానికి వస్తే, దర్శకుడు విఘ్నేష్ రాజా రూపొందించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం కూడా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విభిన్న పాత్రలను ఎంచుకునే ధనుష్, ఈ సినిమాలో మరోసారి తన నటనతో మెప్పించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ధనుష్ సినీ ప్రస్థానం కూడా ఎంతో ప్రత్యేకం. ఆయన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. నటనపై మొదట్లో ఆసక్తి లేకపోయినా తండ్రి కస్తూరి రాజా, అన్న సెల్వరాఘవన్ ప్రోత్సాహంతో 2002లో ‘తుళ్ళువదో ఇళమై’తో కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘ఆడుకలాం’, ‘అసురన్’ చిత్రాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే నిర్మాతగా ‘కాకా ముట్టై’, ‘విసారణై’ చిత్రాలతో కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ధనుష్, హిందీలో ‘రాంజనా’, హాలీవుడ్లో ‘ద గ్రే మాన్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. నటుడిగా మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.