ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్నారు. తుది సన్నాహాల్లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…‘విద్యావ్యవస్థలోని పలు అంశాలను స్పృశిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఆలోచింపజేసే కథ, కథనాలతో పాటు అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఇటీవల మా చిత్రం నుంచి విడుదల చేసిన ‘మాస్టారు మాస్టారు’ పాటకు మంచి స్పందన వస్తున్నది’ అని అన్నారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జె యువరాజ్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్.