జియో+ హాట్‌స్టార్ : స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం : రీతూ వర్మ, సూర్య వశిష్ట, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, శివ కందుకూరి తదితరులు, దర్శకత్వం : బి.కిషోర్
కొందరంతే.. కంఫర్ట్ జోన్లోనే కాలం గడుపుతుంటారు. భూగోళం బద్దలైనా.. ఆ బాక్స్ దాటి బయటికి రారు. అలా.. ఇంటినే కంఫర్ట్ జోన్‌గా భావించి బతికే అమ్మాయి కథే.. ‘దేవిక అండ్ డానీ’. అయితే, అనుకోని పరిస్థితుల్లో ధైర్యంగా మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. కామెడీ, హారర్, రొమాంటిక్, భావోద్వేగ అంశాలతో మొత్తం ఏడు ఏపిసోడ్లుగా రూపొందిన తెలుగు వెబ్‌సిరీస్ ఇది.
ఆంధ్రప్రదేశ్‌లోని రామాపురం అనే పల్లెలో.. ఈ కథ మొదలవుతుంది. దేవిక (రీతూ వర్మ) ఓ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తుంటుంది. చాలా నెమ్మదస్తురాలు. ఇల్లే ప్రపంచం. జగన్నాథం అలియాస్ జగ్గీ (సుబ్బరాజు) చాలా పొసెసివ్‌గా ఉంటాడు. తన ప్రవర్తనతో దేవికతోపాటు చుట్టుపక్కల వారినీ ఇబ్బంది పెడుతుంటాడు. తండ్రి మాట జవదాటని దేవిక.. జగ్గీతో పెళ్లికి సిద్ధమవుతుంది. అదే సమయంలో.. ఊహించని విధంగా ఆమె జీవితంలోకి డానీ (సూర్య వశిష్ట) అనే ఒక అజ్ఞాతవ్యక్తి వస్తాడు.
అనతి కాలంలోనే ఇద్దరిమధ్య అనుబంధం ఏర్పడుతుంది. జగ్గీ, డానీ.. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే సందిగ్ధంలో పడిన దేవికకు.. మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? దానివల్ల దేవిక జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అసలు డానీ ఎవరు? అతని గతం ఏమిటి? అతను దేవికను ఏ సహాయం చేయమని కోరుతాడు? ఆ సహాయం చేసే క్రమంలో దేవికకు ఎదురైన సవాళ్లేంటి? వాటిని దాటుకొని.. దేవిక అనుకున్నది సాధించిందా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.