Janhvi Kapoor | తెలుగు అభిమానులకు బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం జాన్వీ.. ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దైంది. దీంతో చిత్ర బృందంతోపాటు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఈ ఈవెంట్లో ప్రేక్షకులు, అభిమానులకు చెప్పాలనుకున్న మాటలను జాన్వీ ఈ వీడియో ద్వారా చేరవేశారు. ఇందులో జాన్వీ అచ్చతెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది.
‘అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ఆదరిస్తూ, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను మీరు సొంత మనిషిలా భావించడం చాలా సంతోషాన్నిస్తోంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడతాను. దేవర నా మొదటి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ప్రతి అడుగులోనూ సపోర్ట్‌గా నిలిచినందుకు దేవర టీమ్ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు’ అని తెలిపారు.
ఈ మాటలు తాను స్వయంగా చెప్పాలనుకున్నట్లు జాన్వీ తెలిపారు. అయితే, ఈ సారి అలా కుదరలేదన్నారు. త్వరలోనే అందరినీ కలుస్తానన్నారు. ప్రస్తుతానికి ఇది తన తరఫు నుంచి అభిమానులకు చిన్న మెసేజ్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో జాన్వీ లంగా ఓణీ కట్టుకుని అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ హైఐసీసీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు.
ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు. మరో వైపు లోపల కార్యక్రమానికి వచ్చిన అతిథులు సైతం కూర్చునేందుకు వీలు లేకుండాపోయింది. పలువురు అభిమానులు ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నీచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి.. అభిమానులను బయటకు పంపించి వేశారు. అభిమానులను అదుపు చేయడం అసాధ్యమని భావించడంతో పోలీసులు హోటల్ నిర్వాహకులు, పోలీసులు ఈవెంట్‌ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.