Akhil Raj | ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్ రమేష్ మధ్య జరిగిన వివాదం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అఖిల్ రాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. డెలివరీ బాయ్ రమేష్ స్వయంగా తన తప్పును అంగీకరిస్తూ హీరో అఖిల్ రాజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివరాలలోకి వెళితే … కొద్ది రోజుల క్రితం ఫుడ్ డెలివరీ సందర్భంగా జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను రమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ వివాదంపై స్పందించిన అఖిల్ రాజ్, డెలివరీ బాయ్ పొరపాటున తప్పు ఆర్డర్ ఇవ్వడమే కాకుండా, తన తల్లితో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. తాను ఎలాంటి భౌతిక దాడి చేయలేదని, కేవలం హెచ్చరించానని చెప్పారు. తనవైపు తప్పు ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని కూడా పేర్కొన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమేష్, ఈ ఘటనలో తన తప్పు కూడా ఉందని అంగీకరించారు. తాను ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఫుడ్ పార్సిల్‌ను పొరపాటున మరో ఇంటికి ఇచ్చానని, ఆ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని చెప్పారు. ఆ సమయంలో భయంతోనే వీడియో రికార్డ్ చేశానని, ఆ వీడియో ఇంత పెద్ద స్థాయిలో వైరల్ అవుతుందని అసలు ఊహించలేదని తెలిపారు. అంతేకాదు అఖిల్ రాజ్‌కు క్షమాపణలు చెబుతూ, “ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను. జరిగిన దానికి నిజంగా చింతిస్తున్నాను” అని రమేష్ అన్నారు.
అఖిల్ రాజ్ సినీ నటుడు అనే విషయం తనకు అప్పటివరకు తెలియదని రమేష్ చెప్పారు. సాధారణంగా సినిమా హీరోలు విల్లాల్లో ఉంటారని అనుకున్నానని, సాధారణ అపార్ట్మెంట్లో ఉంటారని ఊహించలేదని అన్నారు. తర్వాత ఆయనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అని తెలిసిందని, తెలిసి ఉంటే ఈ వ్యవహారం ఇంతవరకు వెళ్లేది కాదని పేర్కొన్నారు. ఆ సినిమా పాటకు తన భార్యతో కలిసి రీల్ కూడా చేశానని, కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయానని వివరించారు. అయితే అఖిల్ రాజ్ చేసిన అన్ని ఆరోపణలను మాత్రం రమేష్ అంగీకరించలేదు. తాను మద్యం సేవించలేదని, హీరో తల్లిని దూషించలేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ఇంటికి నాన్-వెజ్ ఆర్డర్ వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చని, ఆ కుటుంబం సంప్రదాయాలను తనకు అప్పట్లో తెలియదని చెప్పారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ మరోసారి క్షమాపణలు కోరారు. ఇరు పక్షాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, డెలివరీ బాయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.