The Bads of Bollywood | షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood) వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌లో ఈ – సిగరెట్ వాడరంటూ జాతీయ మానవ హక్కుల కమీషన్ చిత్రబృందానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ వివాదం ముగియకముందే సిరీస్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పాటు అధికారులను చెడుగా చూపించారని.. ఈ సిరీస్‌తో తన పరువుకు భంగం కలిగిందని.. అందుకు గాను పరువునష్టం కింద రూ.2 కోట్లు చెల్లించాలని పిటిషన్ వేశారు.
అయితే ఈ కేసు విషయంలో సమీర్ వాంఖడేకి చుక్కెదురైంది. సమీర్ వాంఖడే వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు ఈ కేసులో వాంఖడే తరఫు న్యాయవాదిని ప్రశ్నిస్తూ.. ఈ పిటిషన్‌ని ఢిల్లీలోనే ఎందుకు విచారించాలని అడిగింది. దీనిపై న్యాయవాది బదులిస్తూ ఈ సిరీస్ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రసారమవుతుంది. ఈ సిరీస్‌ను చూసి పలువురు నెటిజన్లు వాంఖడేపై వ్యంగ్యంగా మీమ్స్ చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఢిల్లీలోనే కనిపిస్తున్నాయంటూ ధర్మాసనం ముందుకు తీసుకువెళ్లారు. అయితే దీనిపై కోర్టు స్పందిస్తూ.. మీరు వేసిన పిటిషన్ సరికాదు. దీనిని మేం విచారించలేం. మీకు ఢిల్లీ నుంచే ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే అందుకు అనుగుణంగా పిటిషన్‌ని వేయండి అప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం అంటూ కోర్టు వెల్లడించింది.