‘వివాహబంధంలో సహనం చాలా ముఖ్యం. ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనా విధానం ఒకేలా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు కాస్త ఓపికతో పరిష్కరించుకోవాలి. మన తల్లిదండ్రులు అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వారి నుంచి నేటి తరం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అని చెప్పింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేటి తరం ప్రేమలు, వివాహ బంధాలపై ఈ భామ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మనం పుట్టి పెరిగిన వాతావరణం, సామాజిక జీవనం వ్యక్తుల ఆలోచనా ధోరణిని ప్రభావితం చేస్తుంది. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారి మధ్య మనస్పర్థలు రావడం చాలా సహజం. అలాంటప్పుడు కాస్త సహనంతో వ్యవహరించాలి. మన తల్లిదండ్రులను సంప్రదిస్తే వారే సరైన పరిష్కారాలు చూపిస్తారు’ అని చెప్పింది. 2018లో అగ్ర నటుడు రణ్వీర్సింగ్ను పెళ్లాడింది దీపికా పడుకోన్. గత ఐదేళ్లుగా ఈ జంట అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.