Deepika Padukone | కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే వాటిని పాజిటివ్‌గా తీసుకోవడం వల్ల నటిగా రాణించగలిగానని చెప్పింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాటి సంగతుల్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్లో నా తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’ రిలీజ్ అయినప్పుడు సినిమా సమీక్షల్లో నాపై తీవ్రంగా విమర్శలు చేశారు. నాకు హిందీ డబ్బింగ్ చెప్పిన వాయిస్‌తో నా లుక్స్‌కు ఏమాత్రం సరిపోలేదని విమర్శించారు.
నేను డైలాగ్స్ చెప్పిన విధానం కూడా బాగాలేదన్నారు. అయితే వాటిని చూసి ఏ మాత్రం కుంగిపోలేదు. నన్ను నేను మార్చుకోవడానికి ఆ రివ్యూలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరోసారి తప్పు జరగొద్దని నాలో సంకల్పాన్ని పెంచాయి. అప్పటి సమీక్షలే నన్ను మార్చివేశాయి. ఒక్కోసారి విమర్శలే మనకు మేలు చేస్తాయి. వాటిని హుందాగా స్వీకరించాలి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో భారీ సినిమాలతో బిజీగా ఉంది. దీపికా పడుకోన్ కథానాయికగా నటించిన ‘సింగమ్ అగైన్’ నవంబర్ 1న విడుదల కానుంది.