Dasari Kiran | ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ వార్త ఇప్పుడు టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం అనే పొలిటికల్ సినిమాను దాసరి కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఇందులో కనిపించే పాత్రలు వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను పోలినట్టుగా ఉండడంతో వివాదాస్పదం అయింది. ఇక ఇదిలా ఉంటే వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఒక ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసుగా తెలుస్తోంది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన గాజుల మహేష్ అనే వ్యక్తి, దాసరి కిరణ్‌కు బంధువు కావడమే కాకుండా, ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం దాసరి కిరణ్..మహేష్ నుంచి రూ. 4.5 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు గడువు ముగిసిన తర్వాత మహేష్ పలుమార్లు డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, దాసరి కిరణ్ నుంచి ఎలాంటి స్పందన లేదట. అయితే ఆగస్ట్ 18న , గాజుల మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలోని దాసరి కిరణ్ కార్యాలయానికి వెళ్లి డబ్బు కోసం నిలదీశారు. అయితే అక్కడ దాసరి కిరణ్ అనుచరులు మహేష్ దంపతులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహేష్ దంపతులు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దాసరి కిరణ్ గతంలో కూడా పలు వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలిచారు. వంగవీటి వంటి పొలిటికల్ సినిమాను నిర్మించి హాట్ టాపిక్ అయ్యారు. “మొగలిరేకులు” సాగర్ హీరోగా సిద్ధార్థ్ అనే చిత్రాన్ని నిర్మించారు. వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించారని ప్రచారం ఉంది. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా నియమితులయ్యారు.తెనాలి మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి రామ్ గోపాల్ వర్మతో ఎక్కువగా సినిమాలు నిర్మించారు.