Vishwak sen | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్తో కూస్తో దూకుడు చూపిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్ సేనే. ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ విడుదలైంది. తొలిరోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో వారం వరకు బాగానే లాక్కొచ్చింది. కానీ దసరా రాకతో ఈ సినిమాకు ఆడియెన్స్ కరువయ్యారు. దాంతో రెండు వారాల్లోపే దుకాణం సర్దేసింది. ఇక నెల తిరక్కుండానే ఓటీటీలో ప్రత్యక్షమవుతుంది. మరి కొన్ని గంటల్లోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదంతా పక్కనపెడితే ఇప్పుడీ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దానికి తగ్గట్లే ఇప్పటికే టీజర్, ట్రైలర్ కట్లను రెడీ చేశారట. మరీ విశ్వక్‌కు తన సినిమా మీద ఏ స్థాయి నమ్మకముందే ఆయనకే తెలియాలి. ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా అన్ని సినిమాలను అందరు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓటీటీలు వచ్చాక ఫలానా భాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూసే వారి సంఖ్య కోట్లలో ఉంది. పైగా నార్త్ వాళ్లు సౌత్ సినిమాల గురించి ఓటీటీల్లో తెగ వెతికేస్తున్నారట. అలాంటిది ఇలాంటి టైమ్‌లో దాస్ కా ధమ్కీ థియేట్రికల్ రిలీజ్ చేయడం అంటే రిస్క్ అనే చెప్పాలి. పైగా ఇది ఇక్కడ రికార్డులు తిరగారిసిన సినిమా కూడా కాదు.
ఇక ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడం ఒక్కటే దాస్ కా ధమ్కీ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి విశ్వక్ హిందీ ఆడియెన్స్‌ను మెప్పించి పోస్టర్ ఖర్చులైనా వెనక్కితీసుకొస్తాడా? లేదా? అని. నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించాడు.