Daku Maharaj | బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, పుష్ప సినిమాలతో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమాలు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే ఓవర్సీస్లో వస్తున్న క్రేజ్ దృష్ట్యా ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల ఈవెంట్లను ఇక్కడ కాకుండా అమెరికాలో ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్ఏలోని టెక్సస్ రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకతో రామ్ చరణ్ అరుదైన రికార్డు కూడా సాధించబోతున్నాడు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలో కాకుంగా అమెరికాలో జరుగబోతుండగా.. ఈ అరుదైన రికార్డును గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ తన ఖాతాలో వేసుకోనున్నాడు.
ఇదిలావుంటే తాజాగా రామ్ చరణ్ బాటలో బాలకృష్ణ రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా అమెరికాలో నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేది టెక్సాస్ రాష్ట్రంలోనే అందుకే ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.