రివ్యూ: కస్టడీ
తారాగణం: నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, సంపత్‌రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: యస్.ఆర్. కతీర్
సంగీతం: ఇళయరాజా, యువన్‌శంకర్ రాజా
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రభు
గత ఏడాది ‘థాంక్యూ’ చిత్రం నిరాశపరచడంతో తాజా సినిమా ‘కస్టడీ’ పై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు యువ హీరో నాగచైతన్య. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు పొందిన వెంకట్‌ప్రభు ఈ చిత్ర నిర్దేశక బాధ్యతల్ని చేపట్టడంతో నిర్మాణం నుంచే ‘కస్టడీ’ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని నాగచైతన్య కెరీర్లోనే భారీ వ్యయంతో తెరకెక్కించారు. తమిళంలో నాగచైతన్య అరంగేట్రం చేస్తున్న చిత్రమిది కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీస్ నేపథ్య కథాంశంతో రూపొందిన ‘కస్టడీ’ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం..
శివ (నాగచైతన్య) వృత్తిపట్ల నిజాయితీ, నిబద్ధత కలిగిన కానిస్టేబుల్. వ్యవస్థలో జరిగే అన్యాయాన్ని ఏ మాత్రం సహించలేడు. అతను రేవతి (కృతిశెట్టి) అనే అమ్మాయి ప్రేమలో ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరి ప్రేమ వ్యవహారం సవ్యంగా సాగదు. లవ్‌లైఫ్‌లో ఇబ్బందులతో సతమతమవుతున్న శివకు.. రాజు (అరవింద్‌స్వామి) అనే క్రిమినల్‌తో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆధిపత్య పోరులో తలెత్తిన వైరంతో ఓ ముఠా రాజుని అంతమొందించాలని చూస్తుంటుంది. అతని రక్షించే బాధ్యతను డిపార్ట్మెంట్ శివపై పెడుతుంది. ఈ క్రమంలో ఏం జరిగింది? రాజుని చట్టానికి పట్టించే క్రమంలో శివకు ఎదురైన సమస్యలేమిటి? ఇంతకు శివ తన ప్రేమ సమస్యను పరిష్కరించుకోగలిగాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా కథ..
విలన్‌ను రక్షించే హీరో కథ ఇదని..ఇప్పటి వరకు ఈ తరహా కథాంశంతో సినిమా రాలేదని దర్శకుడు వెంకట్‌ప్రభు ప్రచార కార్యక్రమాల సందర్భంగా వెల్లడించారు. దీంతో ‘కస్టడీ’ కథ ఎలా ఉంటుందోననే ఉత్సుకత ఏర్పడింది. ముఖ్యంగా వెంకట్‌ప్రభు గత చిత్రాలను చూసిన వారు ఆయన శైలి స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత సన్నివేశాలతో తెరపై ఓ వినూత్న కథను ఆవిష్కరించబోతున్నాడని భావించారు. అయితే ఈ సినిమాలో తనదైన మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు దర్శకుడు వెంకట్‌ప్రభు. ఓ సాధారణ కానిస్టేబుల్ తన శక్తికి మించిన అసాధారణ కార్యంలో ఎలా విజయం సాధించాడన్నది ఇంట్రెస్టింగ్ పాయింటే. అయితే దీనిని తెరపై తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. 90 దశకం నేపథ్యంలో బాంబ్‌బ్లాస్టింగ్ ఎపిసోడ్‌తో కథను ఆసక్తికరంగా మొదలుపెట్టారు. ఆ తర్వాత శివ, రేవతిల ప్రేమ ప్రయాణం సాదాసీదాగా సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కథాగమనంలో ఎలాంటి మలుపులు లేకపోవడం లోపంగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా ఛాయలు కనిపించాయి. ఈ రెండు కథలు ఒక రాత్రిలో జరుగుతాయి. అయితే ‘కస్టడీ’ కథలో అనవసర కమర్షియల్ అంశాల్ని జత చేయడంతో ఎమోషన్ మిస్ అయిందనే భావన కలుగుతుంది.
ఈ సినిమా అసలు కథ ఇంటర్వెల్‌కు ముందే మొదలవుతుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరుగుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ద్వితీయార్థాన్ని కూడా సాగదీశారనిపించింది. క్రిమినల్ అయిన రాజుని కోర్టు ముందు దోషిగా నిలబెట్టడం సెకండాఫ్‌లో రాజు లక్ష్యంగా ఉంటుంది. ఈ క్రమంలో నడిచే కథ అంతగా ఆకట్టుకోలేదు. రాజు పాత్రను తీర్చిదిద్దిన విధానంలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. కరడుగట్టిన నేరస్థుడు క్రమంగా మంచి వాడిగా మారిపోవడం వెనక లాజిక్ ఏమిటో అర్థం కాదు. ఈ క్రమంలో హీరో, విలన్ మధ్య బలమైన సంఘర్షణ లేకుండా పోయింది. ఇక ఈ సినిమా ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఏమాత్రం మెప్పించలేకపోయింది. చాలా సినిమాల్లో చూసిన రొటీన్ ప్లాష్బ్యాక్గా అనిపిస్తుంది. ఓ చిన్న లైన్‌తో కథను నడిపించనప్పుడు స్క్రీన్‌ప్లేను బలంగా రాసుకోవాల్సి ఉంటుంది. అది ఈ సినిమాలో మిస్ అయింది. అయితే నాగచైతన్య తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడు. కథ, స్క్రీన్ప్లేపరంగా కొన్ని లోపాల్ని సరిదిద్దుకుంటే మరో మంచి చిత్రంగా నిలిచిపోయేది.
అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, రాంకీ వంటి సీనియర్ నటులతో భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అరవింద్‌స్వామికి గెటప్ అంతగా కుదరలేదు. అయితే ఆరంభ సన్నివేశాల్లో తనదైన సాఫ్ట్ విలనీ పండించాడు. నాగచైతన్య తన పాత్రలో జీవించాడు. జీవితంలో తీవ్రమైన సంఘర్షణకు లోనవుతూ వృత్తిపరంగా తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చే కానిస్టేబుల్‌గా ఆయన నటన బాగుంది. నాగచైతన్య లుక్స్ కూడా కొత్తగా అనిపించాయి. కృతిశెట్టి డీగ్లామర్ పాత్రలో కనిపించింది. ప్రియమణి పాత్ర ఫర్వాలేదనిపించింది. శరత్‌కుమార్ తనదైన నటనతో మెప్పించాడు. మిగతా పాత్రలు తమ పరిధుల మేరకు ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్ కామెడీ కూడా అంతగా పండలేదు.
ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా సంగీతం ఫర్వాలేదనిపించింది. 90దశకంలో కథ కాబట్టి అప్పటి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడానికి ఇళయరాజాను తీసుకున్నారనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. వెంకట్‌ప్రభు సినిమాల్లో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంటుంది. అయితే ఈ సినిమాలో ఆయన తన మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. కథపై మరింతగా వర్కవుట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
నాగచైతన్య పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రొడక్షన్ వాల్యూస్
కథలో ఎమోషన్ మిస్ కావడం, సాగతీతలా అనిపించిన ప్రథమార్థం
రేటింగ్: 2.25/5