The Paradise| ఇటీవల సినిమాలు మనం గమనిస్తే కొన్ని కథలు ఓ వస్తువు చుట్టూ తిరుగుతూ ఉండడం, అవి ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కాకులు కథా వస్తువుగా మారి నిర్మాతలకి మంచి లాభాలు దక్కేలా చేస్తున్నాయి. గతంలో చూస్తే.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా చిత్రంలో హీరో ఫ్రెండ్ చనిపోయిన తర్వాత పిండాన్ని కాకి ముట్టుకోకపోవడం.. హీరోయిన్ మెడలో హీరో తాళి కట్టిన తర్వాతే కాకి పిండం ముట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులు ఎమోషన్ అయ్యేలా చేశాయి. ఇక కమెడియన్ వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రంలోనూ కాకి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కాకి సెంటిమెంట్..
బలగం చిత్రంలో ‘కాకి ముట్టుడు’ సంప్రదాయాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి ఎమోషనల్ అయ్యేలా చేశారు. కొమరయ్య చనిపోయిన తర్వాత కాకులు పిండాన్ని ముట్టకపోవడం.. కుటుంబ సభ్యులంతా కలిసిపోయిన తర్వాత కాకి పిండం ముట్టడం అనేది చాలా కనెక్ట్ అయింది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తీసిన ‘విరూపాక్ష’ సినిమాలో క్షుద్రపూజల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ కథలో కాకుల గుంపు వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం మనం చూశాం. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట్ అయింది.
గతంలో ఈగలు, పులి, సింహం, పంది, గుర్రం, కుక్క,ఏనుగు , పొట్టేలు, పాములు వంటి వాటితో సినిమాలు రూపొందగా, ఇప్పుడు ఫిలిం మేకర్స్ కాకుల కాన్సెప్ట్ తో కథలు రాసుకుంటున్నారు. కాకుల కాన్సెప్ట్‌తో రూపొందిన ‘దసరా, బలగం’ ‘విరూపాక్ష చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో ఇప్పుడు నాని హీరోగా ది ప్యారడైజ్ అనే చిత్రం రూపొందుతుంది. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇందులో నాని లుక్, మేకింగ్ అనేది భారీ అంచనాలు పెంచుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని లుక్ ఉంది. కాకికి నాని తలను తగిలించి పోస్టర్ రిలీజ్ చేసారు. శ్రీకాంత్ ఓదెల కచ్చితంగా ఏదో డిఫరెంట్ కథను చూపించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమా హిట్టయితే టాలీవుడ్ లో ‘కాకి’ సెంటిమెంట్ ఇంకా బలపడుతుందని చెప్పవచ్చు.